- నిషేధం ఉన్నా విచ్చలవిడిగా విక్రయాలు..
- కిరాణా దుకాణాలే అడ్డాలుగా మారుతున్న వైనం
- యువత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం.. అధికారుల తనిఖీలు కరువు
రేవల్లి, ఆగస్టు 14 (సింగిడి): మండలంలోని పలు గ్రామాలు, మండల కేంద్రాల్లో Gutkha, పాన్‌మసాలా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యావసర సరుకులు విక్రయించే కిరాణా దుకాణాల్లోనే గుట్కా, పొగాకు ఉత్పత్తులను రహస్యంగా విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దుకాణాల ముందు సాధారణంగా కనిపించకుండా గుట్కా ప్యాకెట్లను లోపల దాచి ఉంచి, తెలిసిన వినియోగదారులకు మాత్రమే విక్రయిస్తున్నట్లు సమాచారం. కొన్నిచోట్ల చిన్నపిల్లలు, యువకులు సైతం సులభంగా గుట్కా కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

దీంతో చిన్న వయసులోనే పొగాకు ఉత్పత్తులకు బానిసలవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పాఠశాలలు, బహిరంగ ప్రదేశాలలో, బస్టాండ్లు, ప్రధాన రహదారుల సమీపంలోని దుకాణాల వద్ద కూడా పొగాకు ఉత్పత్తులు అందుబాటులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై అప్పుడప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, కొద్దిరోజులకే పరిస్థితి మళ్లీ యథావిధిగా మారుతోందని ప్రజలు అంటున్నారు.గుట్కా, పాన్‌మసాలా వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో వాటి విక్రయాలపై పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా యువతను ఈ వ్యసనం నుంచి దూరం చేయాల్సిన బాధ్యత కుటుంబాలతో పాటు అధికారులపైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
Join Our WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i
Gutkhaపై తనిఖీలు మహాప్రభో..

ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు మండలంలోని కిరాణా దుకాణాలు, పాన్‌షాపులు, ఇతర విక్రయ కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాలలో, పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిషేధిత గుట్కా విక్రయాలపై అధికారులు ఇకనైనా కఠినంగా వ్యవహరిస్తారా.. లేక యథావిధిగా తనిఖీలకే పరిమితం అవుతారా అనేది వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి: https://site.singidinews.com/venture-real-estate-fraud-plot-buyers-cheated/














