Share
  • మృతదేహాన్ని వాగు ఒడ్డున పొదల్లో పడేసిన నిందితులు
  • ఇద్దరి అరెస్ట్‌.. మరొకరి కోసం పోలీసుల గాలింపు

కాటారం/మహాముత్తారం, అక్టోబర్ (సింగిడి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం (Kataram) మండల పరిధిలో జడల అశోక్‌ మృతి కేసులో మిస్టరీ వీడింది. అటవీ జంతువులను వేటాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగల ఉచ్చులకు తగిలి అశోక్‌ మృతిచెందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో తమ పాత్ర బయటపడుతుందనే భయంతో మృతదేహాన్ని వాగు ఒడ్డున ఉన్న పొదల్లో పడేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను Kataram పోలీసులు అరెస్ట్‌ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నిందితులు అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్‌ తీగల ఉచ్చులు ఏర్పాటు చేసేవారు. యామన్‌పల్లి–నిమ్మగూడెం ప్రధాన రహదారి సమీపంలోని 11 కేవీ విద్యుత్‌ లైన్‌ నుంచి ఇనుప బైండింగ్‌ వైర్లకు విద్యుత్‌ సరఫరా కలిపి అటవీ ప్రాంతంలో ఉచ్చులు అమర్చేవారు. ఈ క్రమంలో యామన్‌పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ ఉచ్చులకు పోడు భూమి పనుల నిమిత్తం అక్కడికి వచ్చిన అజమ్‌నగర్‌కు చెందిన జడల అశోక్‌ (32) తగిలి శుక్రవారం రాత్రి అక్కడికక్కడే మృతిచెందాడు.

Kataram Kataram

Kataram: మృతదేహాన్ని వాగు ఒడ్డున పడేసిన వైనం

మరుసటి రోజు తెల్లవారుజామున ఉచ్చులను పరిశీలించేందుకు వెళ్లిన నిందితులు అశోక్‌ మృతదేహాన్ని గుర్తించారు. తమ ఉచ్చుల కారణంగానే అతడు మృతిచెందిన విషయం బయటపడితే పోలీసులకు చిక్కుతామనే భయంతో మృతదేహాన్ని ఓ కర్రకు కట్టి మోసుకెళ్లి, సుమారు కిలోమీటరు దూరంలోని వాగు ఒడ్డున ఉన్న పొదల్లో పడేసినట్లు విచారణలో తేలింది. అనంతరం పోలీసులకు చిక్కకుండా అడవిలో దాక్కొని మహారాష్ట్రకు పారిపోయేందుకు ప్రయత్నించారు. నమ్మదగిన సమాచారం మేరకు కాటారం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగార్జునరావు నేతృత్వంలో ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది యామన్‌పల్లి శివారులోని చెరువు సమీపంలో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న రత్నం వంశీకృష్ణ (31), రత్నం రాజు అలియాస్‌ రాజేందర్‌, తలారి రాజేందర్‌లను గుర్తించారు.

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి:  https://epaper.singidinews.com/view/164/telangana

Kataram: పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నం

పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా రత్నం వంశీకృష్ణ, రత్నం రాజు అలియాస్‌ రాజేందర్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన ఇనుప బైండింగ్‌ వైర్‌, కాటన్‌ వైర్‌, ఒక స్మార్ట్‌ఫోన్‌, ఒక కీప్యాడ్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన కాటారం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగార్జునరావు, ఎస్‌ఐలు రమేష్‌, మహేందర్‌కుమార్‌, సీహెచ్‌. శ్రీనివాస్‌, మహేష్‌తో పాటు పోలీసు సిబ్బంది రాజు, హరీష్‌, సత్యనారాయణ, లక్ష్మీరాజు, విక్రమ్‌, హరికుమార్‌, తిరుపతి, మశుక్‌, ఐటీ కోర్‌ వేణులను ఉన్నతాధికారులు అభినందించారు. అటవీ జంతువులను వేటాడేందుకు విద్యుత్‌ తీగల ఉచ్చులు ఏర్పాటు చేయడం ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన చర్య అని కాటారం డీఎస్పీ తెలిపారు. ఇలాంటి ఉచ్చుల వల్ల అటవీ జంతువులతో పాటు మనుషుల ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లుతుందన్నారు. ఎక్కడైనా అక్రమ విద్యుత్‌ ఉచ్చులు కనిపించినా, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మైనర్‌పై లైంగిక దాడి!: https://site.singidinews.com/minor-sexual-assault-allegations/

Share