Share

తెలంగాణ ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కీలక పాత్ర పోషిస్తూ, “నీళ్లు, నిధులు, ఉద్యోగాలు” అనే నినాదంతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పలు సభల్లో ప్రజల ముందుంచిన మహనీయుడు Acharya Jayashankar సర్. ఆచార్య జయశంకర్ 1934 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో మహాలక్ష్మి, లక్ష్మీకాంతరావు దంపతులకు జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలపై మంచి పట్టు కలిగిన ఆయన, తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్మ బ్రహ్మచారి. విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

Acharya Jayashankar

1975 నుంచి 1979 వరకు సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా, 1979 నుంచి 1991 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా సేవలందించారు.

విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన జయశంకర్ సర్, “ఇడ్లీ-సాంబార్ గో బ్యాక్” నినాదాలతో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1952 నాటి నాన్-ముల్కీ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకించారు. 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించగా, 1995 తర్వాత మలి దశ తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శిగా, వెన్నెముకగా నిలిచారు.

తెలంగాణలోని ప్రతి పల్లె, పట్టణానికి వెళ్లి ఉద్యమానికి ఊపిరి పోశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు అర్థమయ్యేలా గణాంకాలతో సహా వివరించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.

వనరులపై పూర్తి అధికారం కావాలి

Acharya Jayashankar

“మా వనరులు మాకు ఉన్నాయి… మా వనరులపై మాకు పూర్తి అధికారం కావాలి”, “యాచక దశ నుంచి శాసన దశకు తెలంగాణ రావాలి” అంటూ తెలంగాణ స్వీయపాలన అవసరాన్ని బలంగా వినిపించారు.

తెలంగాణ అభివృద్ధి ఎందుకు వెనుకబడిందో ప్రజలకు వివరించారు. నిజాం కాలంలో ఉన్న గొలుసుకట్టు చెరువులను నిర్లక్ష్యంతో నాశనం చేశారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత వాటిని పునరుద్ధరించాలని అనేక సభల్లో సూచించారు.

2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భవించిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సాధనకు సరైన నాయకుడిగా కే. చంద్రశేఖర్ రావును గుర్తించి, పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన మేధావి జయశంకర్ సర్.

2009 నవంబర్ 29న కే.సి.ఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, డిసెంబర్ 4న శ్రీకాంతాచారి ఆత్మాహుతి తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అనంతరం వచ్చిన పరిణామాల నేపథ్యంలో ఉద్యమం మరింత ఉధృతమైంది.

ఆ సమయంలో జయశంకర్ సర్ తీవ్ర మనోవేదనకు గురైనా ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపించారు. సామాజిక రాజీనామాలు, ఛలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలకు దిశానిర్దేశం చేశారు. మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కుల సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని బలోపేతం చేశారు.

కాళోజీ చెప్పిన “పుట్టుక నీది… చావు నీది… బతుకంతా దేశానిది” అనే మాటను తన జీవితంతో నిజం చేస్తూ, “బతుకంతా తెలంగాణది” అని నిరూపించారు.

“మా తెలంగాణ మాకు కావాలి. యాభై ఏళ్లుగా ఇదే మా ఆకాంక్ష… ఇదే మా శ్వాస, ఇదే మా స్వప్నం” అంటూ తెలంగాణ సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాడారు.

తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ Acharya Jayashankar సర్ 2011 జూన్ 21న కన్నుమూశారు. ఆయన కలల తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న భారతదేశ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది.

Read also: https://site.singidinews.com/eturunagaram-anganwadi-centres-allegations/

అనేక పథకాలకు ‘జయశంకర్ సార్’ పేర్లు’

Acharya Jayashankar

తెలంగాణ ప్రభుత్వం ఆయన సేవలను గుర్తిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆయన పేరును పెట్టింది. ప్రతి ఏడాది జూన్ నెలలో జరిగే బడిబాట కార్యక్రమానికి కూడా “జయశంకర్ బడిబాట” అని నామకరణం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన పేరును పెట్టడం అభినందనీయం.

ఆగస్టు 6న ఆయన జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం మనందరి బాధ్యత. ఆయన సేవలను స్మరించుకుందాం. ఆయన కాంస్య విగ్రహాలను ప్రతి జిల్లా, ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలి.

join our whatsapp channel: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

జోహార్లు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సర్… జోహార్లు!

ప్రతి ఒక్కరూ Acharya Jayashankar జీవిత చరిత్రను చదివి స్ఫూర్తి పొందాలి. తెలంగాణ ఉద్యమం పట్ల ఆయన చూపిన అంకితభావం తరతరాలకు ఆదర్శం.

– కామిడి సతీష్ రెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ సామాజిక రచయితల సంఘం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మొబైల్: 9848445134

Share