- వినాయక, బతుకమ్మ నిమజ్జనాల తర్వాత పేరుకుపోయిన వ్యర్థాలు..
- నీటిలో దుర్వాసన
- నామమాత్రపు శుభ్రతతో సరిపెట్టిన మున్సిపల్ అధికారులు..
- చేపల మృతిపై మత్స్యశాఖ మౌనం!
వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 24 (సింగిడి): వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువు (Wanaparthy Nallacheruvu) అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినాయక విగ్రహాలు, బతుకమ్మలను నిమజ్జనం చేసిన అనంతరం చెరువులో (Wanaparthy Nallacheruvu) పేరుకుపోయిన వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో నీరు కలుషితమై దుర్వాసన వెదజల్లుతోందని, చేపలు, కప్పలు, తాబేళ్లు తదితర జలచరాలు మృత్యువాత పడుతున్నాయని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగ ముగిసిన తర్వాత మున్సిపల్ అధికారులు నల్లచెరువులో కొద్దిపాటి వ్యర్థాలను మాత్రమే తొలగించి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువులో మిగిలిపోయిన పూజా సామగ్రి, ఇతర వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించి నీటి కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ ఆ దిశగా సమగ్ర చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది.
నీటిని ఒడిసిపట్టేందుకు HMWSSB ప్రయత్నాలు: https://site.singidinews.com/who-is-responsible-for-the-hmwssb-pipeline-repair-works/

Wanaparthy Nallacheruvu: జలచరాలు మృత్యువాత పడుతున్నా పట్టించుకోరా?
చెరువులో చేపలు, ఇతర జలచరాలు చనిపోతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాటి మరణాలకు గల కారణాలను గుర్తించేందుకు మత్స్యశాఖ అధికారులు తగిన పరిశీలనలు చేపట్టారా? నీటి నాణ్యతను పరీక్షించారా? జలచరాల మరణాలకు నీటి కాలుష్యమే కారణమా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. శాస్త్రీయ పరీక్షలు నిర్వహించి వాస్తవ కారణాలను వెల్లడించాల్సిన అధికారులు స్పందించకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
రూ. 5కు కడుపు నిండట్లేదు.. నిర్వీర్యమవుతున్న కాంగ్రెస్ ‘ఇందిరమ్మ క్యాంటీన్లు’: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i/789
పండుగల తర్వాత పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఏది?
పండుగల సమయంలో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయడం ఎంత ముఖ్యమో..పండుగలు ముగిసిన తర్వాత చెరువులను శుభ్రపరచడం, నీటి కాలుష్యాన్ని నివారించడం కూడా అంతే ముఖ్యం. అయితే నల్లచెరువులో పేరుకుపోయిన వ్యర్థాలు, దుర్వాసన, జలచరాల మరణాలపై తగిన చర్యలు తీసుకోకపోవడంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉందో అర్థం అవుతుంది.
ప్రజారోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని నల్లచెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తక్షణమే తొలగించాలని, నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించాలని, జలచరాల మరణాలకు గల కారణాలను శాస్త్రీయంగా నిర్ధారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టి చెరువును కాలుష్యం నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా? లేక నల్లచెరువు ((Wanaparthy Nallacheruvu)) కాలుష్యం, జలచరాల మృత్యుఘోష ఇలాగే కొనసాగుతాయా? అన్నది వేచి చూడాలి














