• ఆధునిక కాలంలోనూ చేతులతోనే నాళాలు శుభ్రం..
  • యంత్రాలు కొనుగోలు చేయడంలో అధికారుల వైఫల్యం..
  • రక్షణ పరికరాలు లేకుండానే గటార్లోకి దిగిన పారిశుద్ధ కార్మికులు..
  • ఆధునిక యంత్రాలు వాడకుండా మానవ శ్రమనే దిక్కా..?
  • ఆడంబరాలకు లక్షల్లో ఖర్చులు.. ప్రజావసరాలకు చిల్లర ఖర్చులేనా..?
  • ప్రశ్నిస్తున్న పౌర సమాజం.

పారిశుధ్య కార్మికుల గోసలపై ‘సింగిడి’ ప్రత్యేక కథనం

నారాయణపేట, జూలై 18, (సింగిడి): (sanitation workers) ఒకవైపు దేశం అంతరిక్షంలోకి దూసుకుపోతోంది.. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. కానీ, సమాజాన్ని రోగాల బారి నుంచి రక్షించే పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు మాత్రం ఇంకా ‘ఆగాధాల’ లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. మురికి కూపాలుగా మారిన నాలాలను శుభ్రం చేయడానికి అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చినా, స్థానిక మున్సిపల్ యంత్రాంగం మాత్రం పాత పద్ధతులకే పట్టుబడుతోంది. కార్మికుల ప్రాణాలను పణంగా పెడుతూ, ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా నాలాల్లోకి దింపి మురికిని తీయిస్తున్న దైన్యస్థితి నిత్యకృత్యంగా మారింది.

రక్షణ లేని జీవితాలు.. ప్రాణాలకు గ్యారెంటీ ఏది?

పట్టణాల్లో రోడ్ల పక్కన పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాలు, కుళ్ళిపోయిన పదార్థాలతో కూడిన నాలాలను శుభ్రం చేయడానికి కార్మికులే శరణ్యమవుతున్నారు.

sanitation workers

భద్రత శూన్యం

కనీసం గ్లౌజులు, బూట్లు, మాస్కులు వంటి ప్రాథమిక రక్షణ పరికరాలు కూడా లేకుండా కార్మికులు మోకాళ్ళ లోతు మురుగులోకి దిగి పని చేస్తున్నారు. హానికరమైన వాయువులు, విషపూరిత బ్యాక్టీరియా వల్ల ఈ కార్మికులు తీవ్రమైన చర్మవ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

నామమాత్రపు వేతనాలు

తమ ప్రాణాలను పణంగా పెట్టి సమాజాన్ని శుభ్రం చేసే వీరికి ఇచ్చేది అరకొర జీతాలే. వారి ఆరోగ్య భద్రతకు యంత్రాంగం కల్పిస్తున్న భరోసా సున్నా.

యంత్రాలు ఏవీ?.. యంత్రాంగం నిద్రపోతోందా?
sanitation workers

తడి చెత్త, పొడి చెత్త విభజనలు, స్వచ్ఛ భారత్ ర్యాంకింగుల కోసం కోట్లాది రూపాయల ప్రకటనలు గుప్పించే అధికారులు.. క్షేత్రస్థాయిలో కార్మికుల దైన్యస్థితిని మాత్రం పట్టించుకోవడం లేదు.

Read this Story: https://site.singidinews.com/tet-is-shameless-thing-for-teachers/

ప్రశ్నిస్తున్న ప్రజానీకం

నాలాల పూడికతీతకు వాక్యూమ్ క్లీనర్లు, అత్యాధునిక డ్రెడ్జింగ్ యంత్రాలు కొనుగోలు చేయడానికి నిధులు ఎందుకు కేటాయించడం లేదు? ఉన్నతాధికారుల వాహనాలకు, విలాసాలకు ఖర్చు చేసే బడ్జెట్‌లో కనీసం పారిశుద్ధ్య యంత్రాల కొనుగోలుకు చోటు లేదా? సరిపడా యంత్ర పరికరాలను సమకూర్చడంలో స్థానిక మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు అనడానికి రోడ్డు పక్కన పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు చేతపట్టుకుని నాలాల్లో దిగి పని చేస్తున్న దృశ్యాలే నిలువెత్తు సాక్ష్యం. చట్ట ప్రకారం మనుషుల చేత ఇలాంటి పనులు చేయించడం నిషేధమైనప్పటికీ, చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి.

ఇకనైనా కళ్లు తెరవాలి

పాలకులారా.. అధికారులారా.. ఇకనైనా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మానేయండి. పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గౌరవించండి.

ఆధునిక యంత్రాలను సమకూర్చాలి

నాలాల పూడికతీతకు మానవ శ్రమను వాడకుండా, తక్షణమే రోబోటిక్ లేదా మెకానికల్ డ్రెడ్జింగ్ యంత్రాలను అందుబాటులోకి తేవాలని, పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.

రక్షణ పరికరాల పంపిణీ

విధులు నిర్వహించే ప్రతి కార్మికునికి నాణ్యమైన సేఫ్టీ కిట్లు (గ్లౌజులు, గమ్‌బూట్లు, మాస్కులు, గాగుల్స్) తప్పనిసరిగా అందించాలి.

ఆరోగ్య బీమా

ప్రతి కార్మికునికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, కనీసం 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాల్సిన అవసరంకూడ ఎంతైనా ఉంది.

కార్మికుల చెమట చుక్కతోనే మన ఊరు శుభ్రంగా ఉంటోందనే కనీస కృతజ్ఞతను యంత్రాంగం ప్రదర్శించాలి. వారి ప్రాణాలతో చెలగాటమాడటం ఆపి, తక్షణమే ఆధునిక పరికరాల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని పౌరసమాజం డిమాండ్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *