- తాళం వేసి దర్శనమిస్తున్న కేంద్రాలు..!
- పోషకాహారం అందడం లేదని గ్రామస్తుల ఆవేదన
- గ్రామ పంచాయతీ సభలో అధికారుల పర్యవేక్షణపై విమర్శలు
ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 5 ( సింగిడి ): ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో పలు Anganwadi కేంద్రాల పనితీరుపై గ్రామస్తులు, మహిళా సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సభలో అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా నిర్వహించడం లేదని, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందించాల్సిన పోషకాహారం సకాలంలో అందడం లేదని ఆరోపించారు.
గ్రామస్తుల కథనం ప్రకారం, కొన్ని అంగన్వాడీ కేంద్రాలు తరచూ తాళం వేసి కనిపిస్తుండగా, మరికొన్ని కేంద్రాల్లో ఆయాలు మాత్రమే ఉండి టీచర్లు విధులకు హాజరుకావడం లేదని తెలిపారు. ఒక కేంద్రంలో వారం రోజులుగా టీచర్ విధులకు రాకపోవడంతో ఇద్దరు చిన్నారులతో మాత్రమే కేంద్రం కొనసాగుతోందని పేర్కొన్నారు.

బుధవారం పలు Anganwadi కేంద్రాలను పరిశీలించిన మాల సామాజిక న్యాయ వేదిక ములుగు జిల్లా అధ్యక్షుడు గంపల శివకుమార్ మాట్లాడుతూ, అనేక కేంద్రాల్లో టీచర్లు అందుబాటులో లేరని, కొన్ని కేంద్రాలు పూర్తిగా మూతపడి ఉన్నాయని ఆరోపించారు. పాప్కాపురం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో టీచర్, ఆయా ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో కేంద్రం పనిచేయడం లేదని స్థానికులు తెలిపినట్లు పేర్కొన్నారు.
Anganwadiల్లో గుడ్లే లేవు
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వేడి భోజనం, గుడ్లు, పాలు, ఇతర పోషకాహార పదార్థాలు, అలాగే గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందించే పోషకాహార సరఫరా సక్రమంగా జరగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఐసీడీఎస్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం, కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే ఉండడం, అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు విమర్శించారు. తల్లిపాల వారోత్సవాలు వంటి కార్యక్రమాలు కూడా కేవలం ఫోటోలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు.

Anganwadi వ్యవస్థలో గతంలో జరిగిన పదోన్నతులు, బదిలీలపై కూడా గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో జిల్లా కలెక్టర్ కొన్ని అక్రమ నియామకాలు, బదిలీలను రద్దు చేసినప్పటికీ, అనంతరం నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, బదిలీలు జరిగాయని ఆరోపిస్తూ సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Join Our WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అంగన్వాడీ సేవలను మెరుగుపరచాలని పలుమార్లు ఆదేశించినప్పటికీ, వాటి అమలులో నిర్లక్ష్యం కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపించారు.
Read Now: https://site.singidinews.com/mla-allegations-baseless-clarification/
అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై జిల్లా యంత్రాంగం వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రతి కేంద్రం ప్రతిరోజూ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.















