- రూ.450 కోట్ల ఆరోపణల్లో నిజం లేదు
- ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల, ఆగస్టు 5 (సింగిడి): తనపై ఇటీవల వచ్చిన అవినీతి ఆరోపణలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తీవ్రంగా ఖండించారు. తనపై ప్రచారంలో ఉన్న రూ.450 కోట్ల రుణం, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే కొందరు ప్రజాప్రతినిధులు, ప్రత్యర్థి వర్గాలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2009–10 సంవత్సరంలో బ్యాంకు నుంచి రుణం మంజూరైందని, ఆ తర్వాత కంపెనీకి సంబంధించిన అన్ని లావాదేవీలు, చెల్లింపులు, ఎన్పీఏ వివరాలు అధికారిక రికార్డుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తే పూర్తి ఆధారాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వాస్తవాలను పరిశీలించకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
Read This Also: https://site.singidinews.com/tgsrtc-bhupalpallybus-passengers-concern/
ప్రజాసమస్యలపై పోరాటం చేశా: MLA
కాంగ్రెస్ పార్టీ కోసం పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేశానని ప్రేమ్ సాగర్ రావు గుర్తుచేశారు. అధికారంలో ఉన్న సమయంలో కూడా తాను ఎప్పుడూ సాండ్, ల్యాండ్ మాఫియాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తానని, తన రాజకీయ జీవితంపై మచ్చ తెచ్చే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
Join Our WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i
ఆరోపణల వెనుక రాజకీయ ఉద్దేశాలు: MLA
ఇటీవల తన పేరు మంత్రి పదవి చర్చల్లో వినిపిస్తున్న సమయంలోనే ఇలాంటి ఆరోపణలు రావడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. తనపై వచ్చిన ప్రతి ఆరోపణపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విజ్ఞప్తి చేశారు. ప్రజాసేవే తన లక్ష్యమని, రాజకీయంగా తనను బలహీనపర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ధైర్యంగా ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు.














