Share
  • ఊరి బయట రాళ్లురప్పలు.. పాఠశాలల్లో ఇరుకు స్థలం..
  • గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ప్రోత్సాహం కరువు

రేవల్లి, ఆగస్టు 27 (సింగిడి): వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని గ్రామాల్లో క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు కొదవలేదు. కానీ అందుకు తగిన విధంగా Sports Groundsయే లేవు. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడల్లో తమ సత్తా చాటుతున్న క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారు. సరైన శిక్షణ లేకపోయినా, అందుబాటులో ఉన్న పరిమిత వసతులతోనే నిత్యం సాధన చేస్తూ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. అయితే వారి ప్రతిభకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు లేకపోవడం, అనుకూలమైన క్రీడా మైదానాలు అందుబాటులో లేకపోవడం రేవల్లి మండలంలోని గ్రామీణ క్రీడాకారులకు ప్రధాన సమస్యగా మారింది. గతంలో గ్రామాల్లో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు ప్రస్తుతం క్రీడాకారులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రేవల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో మైదానాలను ఊరికి బయట ఏర్పాటు చేయగా, మరికొన్ని చోట్ల పాఠశాల ప్రాంగణాల్లో క్రీడా స్థలాలను ఏర్పాటు చేశారు. ఊరికి బయట ఉన్న మైదానాల్లో రాళ్లు, రప్పలు, గుంతలు ఉండటంతో క్రీడాకారులు సాధన చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైదానం చదునుగా లేకపోవడంతో పరుగులు, కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడల్లో సాధన చేసే సమయంలో గాయాలయ్యే ప్రమాదం ఉంది.మరికొన్ని గ్రామాల్లో పాఠశాల ప్రాంగణాలనే క్రీడా స్థలాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే పాఠశాల ప్రాంగణంలో అందుబాటులో ఉన్న స్థలం చాలా తక్కువగా ఉండటంతో ఒకేసారి ఎక్కువ మంది క్రీడాకారులు సాధన చేయడానికి అవకాశం ఉండటం లేదు.

Sports Grounds

విద్యార్థుల విద్యా అవసరాలతో పాటు క్రీడా కార్యకలాపాలు కూడా అదే ప్రాంగణంలో కొనసాగాల్సి రావడంతో ప్రత్యేక క్రీడా మైదానం అవసరం ఏర్పడుతోంది.క్రీడా మైదానం అంటే కేవలం కొంత ఖాళీ స్థలం ఉండటం కాదని క్రీడాకారులు అంటున్నారు. ఆటకు అనువుగా స్థలాన్ని చదును చేయడం, రాళ్లు, రప్పలు తొలగించడం, అవసరమైన క్రీడా పరికరాలు ఏర్పాటు చేయడం, తాగునీరు, మరుగుదొడ్లు, రాత్రివేళ సాధనకు వెలుతురు వంటి సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ సదుపాయాలు అందుబాటులో ఉంటేనే రేవల్లి మండలంలోని గ్రామీణ యువత క్రీడల్లో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు గ్రామాల్లో ప్రతిభ ఉన్నప్పటికీ వారిని గుర్తించి తదుపరి స్థాయికి తీసుకెళ్లే వ్యవస్థపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానికంగా మంచి ఆటతీరు కనబరిచే క్రీడాకారులను గుర్తించి వారికి సరైన శిక్షణ ఇప్పించడం, ఎంపిక పోటీలు నిర్వహించడం, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి పోటీలకు పంపించడం వంటి చర్యలు నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉంది.
ప్రతిభావంతులైన క్రీడాకారులకు సరైన మార్గదర్శకత్వం లభిస్తే వారు వనపర్తి జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించే అవకాశం ఉంది. కానీ గ్రామస్థాయిలోనే వారి ప్రతిభను గుర్తించే అవకాశాలు లేకపోవడంతో అనేకమంది క్రీడాకారులు తమ ప్రతిభను కొనసాగించలేకపోతున్నారు. చదువుతో పాటు క్రీడల్లో భవిష్యత్తు నిర్మించుకోవాలనుకునే రేవల్లి మండల యువతకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Sports Grounds విషయంలో మా కోరిక తీర్చండి సారూ

రేవల్లి మండలంలోని గ్రామాల్లో క్రీడా మైదానాల పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, క్రీడాకారులకు అనుకూలంగా లేని మైదానాలను గుర్తించి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఊరికి బయట ఉన్న మైదానాలను చదును చేసి రాళ్లు, రప్పలు తొలగించడంతో పాటు క్రీడలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని, పాఠశాల ప్రాంగణాల్లో ఉన్న చిన్న స్థలాలకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక స్థలాలను కేటాయించాలని వారు కోరుతున్నారు.ప్రతి గ్రామంలో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు క్రమం తప్పకుండా పోటీలు నిర్వహిస్తే ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయికి వెళ్లే క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, పోటీల సమాచారం అందించాల్సిన అవసరం ఉంది. ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ క్రీడాకారులకు ఆ అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో వనపర్తి జిల్లాకు మంచి క్రీడాకారులను అందించే అవకాశం ఉంటుంది.

28 నుంచే ఇందిరమ్మ ఇండ్ల లాటరీ: https://epaper.singidinews.com/view/101/telangana

ఇదే అసలు ప్రశ్న..

Sports Grounds

మైదానాలు ఏర్పాటు చేశామని చెప్పుకోవడం కంటే.. అవి క్రీడాకారులు ఆడుకునేందుకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయన్నదే అసలు ప్రశ్న. రేవల్లి మండలంలోని గ్రామాల్లో సత్తా ఉన్న క్రీడాకారులు ఉన్నారు.. కానీ సరైన మైదానం లేదు, అవసరమైన శిక్షణ లేదు, జిల్లా స్థాయికి తీసుకెళ్లే సరైన వేదిక లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడా మైదానాలను అభివృద్ధి చేసి, గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి జిల్లా స్థాయికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు, క్రీడాభిమానులు కోరుతున్నారు.

మైనర్‌పై లైంగిక దాడి!: https://site.singidinews.com/minor-sexual-assault-allegations/

Share