డోర్నకల్ /మరిపెడ జులై 18( సింగిడి): మహబూబాబాద్ (MHBD) జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ షబరీష్ పి., ఐపీఎస్‌ను సాహసయాత్రికుడు భూక్యా యశ్వంత్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి తన సాహసయాత్రల విశేషాలను వివరించారు.ఈ సందర్భంగా యశ్వంత్ నాయక్ తన క్రీడా ప్రస్థానం, సాహసయాత్రల పట్ల ఉన్న అభిరుచి, దేశభక్తిని చాటే “హర్ శిఖర్ పర్ తిరంగా” జాతీయ లక్ష్యంతో చేపడుతున్న యాత్రల గురించి ఎస్పీకి వివరించారు. ఇటీవల లడఖ్‌లో నిర్వహించిన సాహసయాత్రకు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించి, ఆ యాత్రలో ఎదుర్కొన్న సవాళ్లు,అనుభవాలు, విజయాలను వివరించారు.యువతలో సాహస స్ఫూర్తి, దేశభక్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో తాను ఈ యాత్రలను కొనసాగిస్తున్నట్లు యశ్వంత్ నాయక్ తెలిపారు.యశ్వంత్ నాయక్ చేపడుతున్న సాహసయాత్రలను అభినందించిన ఎస్పీ డాక్టర్ షబరీష్ పి., ఆయన సాధించిన విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, యువతకు ఆదర్శంగా నిలిచేలా తన ప్రయాణాన్ని కొనసాగించాలని ప్రోత్సహించారు.ఎస్పీతో జరిగిన భేటీ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని, తన జీవితంలో చిరస్మరణీయమైన సందర్భంగా నిలిచిపోతుందని యశ్వంత్ నాయక్ పేర్కొన్నారు. తనకు సమయం కేటాయించి, ఆత్మీయంగా మాట్లాడి, విలువైన సూచనలు, ప్రోత్సాహం అందించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ షబరీష్ పి., ఐపీఎస్‌కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Read Now: https://site.singidinews.com/janasena-expresses-strong-anger-over-the-ashwapuram-incident/