• నేరుగా రంగంలోకి డిప్యూటీ ట్రైని కలెక్టర్..
  • అవినీతి లీలలపై కథనాలకు కదలిక

దమ్మపేట (సింగిడి): (MRO OFFICE) దమ్మపేట మండల తహశీల్దార్‌ కార్యాలయంలో ఇన్నాళ్లూ సాగిన ‘చేతివాటం’ దందాలకు, దళారుల రాజ్యానికి ఎట్టకేలకు బ్రేక్‌ పడింది. సామాన్య ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ, సర్టిఫికెట్ల నుంచి భూ రికార్డుల దాకా ప్రతి చిన్న పనికీ వేలాది రూపాయలు గుంజిన అవినీతి తిమింగలాల ఆట కట్టించేందుకు నూతన తహసీల్దార్ డిప్యూటీ ట్రైని కలెక్టర్ రాకతో రెవెన్యూ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. కార్యాలయంలో దళారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు దమ్మపేట డిప్యూటీ కలెక్టర్‌ తహశీల్దార్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఎవరూ మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మధ్య కాలంలో దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో అవినీతి పరాకాష్టకు చేరిన సంగతి తెలిసిందే. సామాన్యుడు అడుగుపెడితే పనికాదు సరికదా.. దళారి ఉంటేనే ఫైలు కదిలే పరిస్థితి దాపురించింది. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం విద్యార్థులను, నిరుద్యోగులను ఏడిపించడం.. పేదవాడి భూ సమస్యలను అడ్డం పెట్టుకుని లక్షల్లో బేరసారాలు సాగించడం వంటి అక్రమాలు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. కార్యాలయంలోని కొందరు అధికారులు, సిబ్బంది అండతోనే ఈ దళారీ గుఠాంతం యథేచ్ఛగా సాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు పత్రికల్లో ఈ అవినీతి లీలలపై వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. రూపాయి లంచం లేకుండా.. పారదర్శక సేవలు కార్యాలయంలో పేరుకుపోయిన అవినీతి మరకలను కడిగేసేందుకు కొత్తగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ ట్రైని కలెక్టర్ తహశీల్దార్ కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఇకపై ఆఫీసులో ఎలాంటి దళారీ వ్యవస్థకు తావు లేదని భరోసా ఇచ్చారు. ప్రతి దరఖాస్తును అత్యంత పారదర్శకంగా, చట్టపరిధిలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

సమస్య ఉన్నా నేరుగా కలవండి: తహసీల్దార్

(MRO OFFICE) మండల పరిధిలోని గ్రామ ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు. ధృవీకరణ పత్రాలు: కులం, ఆదాయం, స్థానిక నివాసం, జనన, మరణ, కుటుంబ సభ్యుల దృవీకరణ వగైరా ఏ దరఖాస్తులైనా నేరుగా ఆఫీసులోనే ఇవ్వాలని, భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు, రికార్డుల సమస్యలు ఉన్నా మధ్యవర్తుల చుట్టూ తిరగొద్దు.నేరుగా తహశీల్దార్ ను కలిసి తమ సమస్యలను విన్నవించుకోవాలని తెలిపారు. ప్రజల కోసమే ఈ విప్లవాత్మక మార్పు తెచ్చామని, ఎవరైనా లంచం అడిగినా, దళారులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇన్నాళ్లూ కార్యాలయాన్ని పట్టిపీడించిన దళారీ భూతానికి ఈ నిర్ణయంతో శాశ్వతంగా చెక్ పడుతుందని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More: https://site.singidinews.com/kcr-you-do-whatever-save-our-peddi/

Join Our WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *