- అత్యవసర వైద్యం శూన్యం..
- వర్షం వస్తే చెరువులా మారుతున్న భవనం..
- మందుల కొరతతో రైతుల ఇబ్బందులు..!
దమ్మపేట, జూలై 28(సింగిడి): (PVC) కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పశువైద్యశాల కనీస అభివృద్ధికి నోచుకోక పాలకుల నిర్లక్ష్యానికి అధ్వాన్న స్థితికి చేరింది. పశువుల ప్రాణాలను కాపాడాల్సిన ఈ ఆసుపత్రి, బురదమయంగా మారి ప్రస్తుతం పశువులను తీసుకురావడానికే భయపడేలా తయారైందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షపు నీటితో ఇబ్బందులు:
స్వల్ప వర్షం పడినా ఆసుపత్రి ప్రాంగణమంతా మోకాళ్ల లోతు నీరు నిలిచిపోతోంది. లోతట్టు ప్రాంతంలో ఉండటం, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు నేరుగా ఆసుపత్రి లోపలికి చేరుతోంది. దీంతో అనారోగ్యంతో ఉన్న గేదెలు, ఆవులను వైద్యం కోసం తీసుకువచ్చే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది కూడా నీటిలోనే నిలబడి విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. పశువుల ఆసుపత్రి దుస్థితిని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు మండిపడుతున్నారు. (PVC)
Join Our WhatsApp Channel:https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i
అరకొర వైద్యం – మందుల కొరత
పశువులకు ఏదైనా అనారోగ్యం చేసి ఇక్కడికి తీసుకువస్తే కేవలం ప్రాథమిక చికిత్స (ఇంజక్షన్, టాబ్లెట్) మాత్రమే అందుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. పశువుల ఎదుగుదలకు, పాల దిగుబడికి అత్యవసరమైన క్యాల్షియం వంటి కనీస మందులు కూడా ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడం గమనార్హం. వైద్యులు రాసిచ్చే మందులను బయట ప్రైవేట్ మెడికల్ షాపుల్లో వేలాది రూపాయలు పోసి కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య వస్తే ఇక్కడ సరైన వైద్యం అందుతుందనే నమ్మకం లేదని ఆందోళన చెందుతున్నారు.
అధికారులు స్పందించాలి
రైతులకు వెన్నెముక లాంటి పశుసంపదను కాపాడటానికి, ఉన్నతాధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని దమ్మపేట మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు. (PVC) ఆసుపత్రికి నూతన భవనాన్ని మంజూరు చేయాలని, తక్షణమే అవసరమైన మందుల సరఫరాను పునరుద్ధరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Read Now: https://site.singidinews.com/mro-office-dammapeta-tahsildar-office-end-broker-system/
