Share
  • రూ. 2 లక్షలు డిమాండ్ చేసిన దమ్మపేట నవతెలంగాణ రిపోర్టర్
  • బెదిరించి 50 వేలు ఫోన్‌పే చేయించుకున్న వైనం
  • మిగతా సొమ్ము కోసం వేధింపులు..తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన సదరు మహిళ
  • ఓ పత్రిక విలేఖరిపై దమ్మపేట పోలీసుల యాక్షన్
  • ఎఫ్ ఐ ఆర్ నమోదు

దమ్మపేట(సింగిడి): కష్టపడి కొనుక్కున్న భూమికి పాస్‌బుక్ వచ్చిందన్న సంతోషం ఆ కుటుంబంలో ఎంతో కాలం నిలవలేదు. “Agency ప్రాంతంలో భూమి ఎలా కొంటారు? మీ అంతు చూస్తా.. పత్రికలో వార్తలు రాసి పరువు తీస్తా” అంటూ ఓ పత్రికా విలేఖరి సదరు మహిళను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ బెదిరింపులకు భయపడి బాధితురాలు విడతలవారీగా రూ. 50,000 ఫోన్‌పే చేసినా సదరు విలేఖరి వేధింపులు ఆపలేదు. చివరకు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దమ్మపేట మండలంలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

భూమి కొంటే బెదిరింపులు..

మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన ధార మల్లీశ్వరి అనే మహిళ.. కోటగిరి కృష్ణ అనే వ్యక్తి వద్ద నుండి కొంత వ్యవసాయ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్ కూడా ఆమె పేరు మీదికి బదిలీ అయింది. అంతా సజావుగానే సాగుతుందనుకున్న సమయంలో, దమ్మపేట మండలానికి చెందిన ‘నవతెలంగాణ’ పత్రిక విలేఖరి సాయి ప్రసాద్ శాస్త్రి కన్ను ఆ భూమిపై పడింది. బాధితురాలికి ఫోన్ చేసిన ఆయన.. “ఏజెన్సీ ఏరియాలో చట్టాన్ని ఉల్లంఘించి భూమిని ఎలా కొనుగోలు చేస్తారు? మీకు పాస్‌బుక్ ఎలా ఇస్తారు?” అంటూ అధికార స్వరంతో బెదిరింపులకు దిగాడు.

Agency Land.. రూ. 2 లక్షలు ఇస్తేనే వదిలేస్తా!

ఈ వ్యవహారంపై పత్రికలో పెద్ద ఎత్తున తప్పుడు వార్తలు రాస్తానని, మిమ్మల్ని సర్కారు చుట్టూ తిరిగేలా చేస్తానని శాస్త్రి హెచ్చరించాడు. ఈ లొసుగుల నుంచి తప్పించుకోవాలన్నా, పత్రికలో వార్త రాకుండా ఉండాలన్నా తనకు రూ. 2 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని, మీ అంతు చూస్తానని ఘాటుగా బెదిరించాడు. సదరు విలేఖరి ఆవేశాన్ని, బెదిరింపులను చూసి తీవ్ర ఆందోళనకు గురైన మల్లీశ్వరి.. గత్యంతరం లేక ప్రాథమికంగా ఆయన చెప్పిన నంబర్‌కు ఫోన్‌పే (ఫోన్ పే) ద్వారా రూ. 50,000 బదిలీ చేసింది. మిగిలిన డబ్బుల కోసం కూడా సదరు విలేఖరి ఒత్తిడి తెస్తూ, మానసిక వేధింపులకు గురిచేస్తుండటంతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు లోనైంది.

Join Our WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

పోలీసుల రంగప్రవేశం..

agency

Agency ల్యాండ్ విషయంలో సదరు విలేఖరి వేధింపులు మితిమీరడంతో, బాధితురాలు ధార మల్లీశ్వరి చివరకు ధైర్యం చేసి దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. విలేఖరి సాయి ప్రసాద్ శాస్త్రి తనను డబ్బుల కోసం ఎలా వేధించాడో, ఫోన్‌పే ద్వారా నగదు ఎలా వసూలు చేశాడో పోలీసులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన దమ్మపేట పోలీసులు.. సదరు విలేఖరిపై బెదిరింపులు, అక్రమ వసూళ్ల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు పూర్తి ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. ముసుగులో ఉండి ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సూత్రధారులు ఎవరు?.. ‘బడా బాబుల’ గుండెల్లో రైళ్లు!

కాగా, ఈ భూమి బ్లాక్‌మెయిల్ దందా వెనుక కేవలం సాయి శాస్త్రి ఒక్కడే లేడని, అతని వెనుక కొందరు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ‘బడా బాబులు’, కీలక సూత్రధారుల హస్తం కూడా ఉన్నట్లు మండలంలో తీవ్ర ప్రచారం జరుగుతోంది. విలేకరిని ముందు పెట్టి వెనుక ఉండి నడిపిస్తున్న ఆ పెద్ద మనుషులు ఎవరు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి పేర్లు కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉండటంతో ఆ ‘బడా బాబుల’ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ఈ అక్రమ వసూళ్ల ముఠా మొత్తాన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: https://site.singidinews.com/gutkha-sale-illegal-sales-despite-ban/

Share