Share
  • ఆదివాసీ మహిళలపై అధికారుల దురుసు ప్రవర్తన దురదృష్టకరం
  • తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు డా. గడల శ్రీనివాసరావు డిమాండ్

అశ్వాపురం : (Janasena)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, మనుబోతులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివాసీ మహిళల పట్ల ప్రభుత్వ అధికారులు అత్యంత అనాగరికంగా, దురుసుగా ప్రవర్తించిన ఘటనపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, మాజీ ఆరోగ్య సంచాలకులు డా. గడల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధ్యులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజ్యాంగ హక్కులపై జరిగిన దాడి

janasena

ఈ సందర్భంగా డా. గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ దౌర్జన్యం కేవలం కొందరు మహిళలపై జరిగిన దాడి మాత్రమే కాదని, ఇది ఆదివాసీల గౌరవం, భద్రత, వారి రాజ్యాంగబద్ధ హక్కులపై జరిగిన తీవ్రమైన దాడిగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. స్వతంత్ర భారత దేశంలో ప్రతి మహిళా గౌరవంగా జీవించే హక్కును కలిగి ఉందని, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన ఆదివాసీల పట్ల అధికార యంత్రాంగం అత్యంత సున్నితంగా, మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని ఆయన గుర్తుచేశారు. రక్షించాల్సిన చట్టమే భక్షకంగా మారడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని మండిపడ్డారు.

​నిష్పక్షపాత విచారణ జరపాలి..


​అధికార బలిమిని ప్రదర్శిస్తూ మహిళల పట్ల అనాగరికంగా వ్యవహరించిన ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని జనసేన డిమాండ్ చేస్తోంది. ఎటువంటి పక్షపాతం లేకుండా, అత్యంత పారదర్శకంగా ఉన్నత స్థాయి విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రాథమిక విచారణలో అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే, సదరు అధికారులపై చట్టప్రకారం కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Readnow: https://site.singidinews.com/who-is-responsible-for-the-hmwssb-pipeline-repair-works/

​వ్యవస్థలపై నమ్మకం కోల్పోకుండా చూడాలి

​ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలే, ప్రజల్లో భయాందోళనలకు కారణమవ్వడం అత్యంత దురదృష్టకరమని డా. గడల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ మహిళల గౌరవాన్ని కాపాడటం అంటే అది మన సమాజ గౌరవాన్ని కాపాడటమేనని, వారిపై జరిగే ఎలాంటి అవమానాన్ని లేదా అన్యాయాన్ని నాగరిక సమాజం అస్సలు సహించబోదని హెచ్చరించారు. ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లకుండా ఉండాలంటే, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

​బాధితులకు జనసేన అండ..

మహిళల ఆత్మగౌరవం, భద్రత, ఆదివాసీల హక్కుల పరిరక్షణ విషయంలో జనసేన పార్టీ ఎన్నడూ రాజీపడబోదని డా. గడల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. న్యాయం, మానవత్వం, సమానత్వం అనే విలువల పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు కట్టుబడి.. బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.
Share