Share
  • నైనీ బొగ్గు రాకతో ఎస్టీపీపీ లో సంబరాలు
  • బొగ్గు రవాణాలో సింగరేణి సరికొత్త రికార్డు
  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మంచిర్యాల(సింగిడి): Singareni చరిత్రలో మరో సువ‌ర్ణ‌ అధ్యాయం ఆవిష్కృతమైంది. ఒడిశా రాష్ట్రంలోని Singareni నైనీ బొగ్గు గని నుంచి లోడ్ చేసిన తొలి బొగ్గు రైల్వే రేకు సుమారు 1,131 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసి గురువారం ఉద‌యం మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని  సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎస్టీపీపీ) కి చేరుకుంది. ఇతర రాష్ట్రంలోని సింగరేణి గని నుంచి తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు సరఫరా కావడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో ఎస్టీపీపీలో పండుగ‌ వాతావరణం నెలకొంది.

singareniకి భట్టి విక్రమార్క శుభాకాంక్షలు

ఈ సందర్భంగా విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు వీడియో సందేశం ద్వారా సింగరేణి యాజమాన్యం, అధికారులు, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర విద్యుత్ అవసరాలే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని, తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతున్న సింగరేణి, ఇప్పుడు ఒడిశాలోని తన నైనీ గని నుంచి కూడా తెలంగాణకు బొగ్గు ను తీసుకురావ‌డం చారిత్రాత్మ‌క ఘ‌ట్టంగా అభివ‌ర్ణించారు.
సింగ‌రేణి విస్త‌ర‌ణ‌కు, బ‌లోపేతానికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డితోపాటు యావ‌త్ క్యాబినెట్ కృషి చేస్తోంద‌న్నారు. సింగరేణి సంస్థ పటిష్టత, విస్తరణకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, ఇటీవల తాడిచెర్ల-2 బ్లాక్, మణుగూరు డిప్‌సైడ్ బ్లాక్ల ను సంస్థకు సాధించామని తెలిపారు. సింగరేణి తెలంగాణకే పరిమితం కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు విస్తరించాలని, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మిన‌ర‌ల్స్ రంగంలోనూ అడుగుపెట్టాల‌న్నారు.  ప్ర‌పంచంలో అత్యుత్త‌మ మైనింగ్ సంస్థ‌ల‌తో పోటీప‌డేలా సింగ‌రేణిని అంత‌ర్జాతీయ సంస్థ‌గా తీర్చిదిద్దుతామ‌న్నారు.

59 బాక్సుల్లో 4000 టన్నుల బొగ్గు

నైనీ సమీప హిందోల్‌ రైల్వే సైడింగ్‌లో లోడ్ చేసిన తొలి రైల్వే రేకులో 59 BOXN వేగన్ల ద్వారా సుమారు 4000 టన్నుల జి-10 గ్రేడ్ బొగ్గు తెలంగాణకు చేరింది. ఈ బొగ్గును రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం వినియోగించనున్నారు.
ఒడిశా నుంచి తెలంగాణకు తొలి బొగ్గు రవాణా విజయవంతం కావడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం, భారతీయ రైల్వేలు, సంబంధిత అధికారులు, ఉద్యోగులకు సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ద‌ప్రకాశ్ జ్యోతి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తొలి రైల్వే రేకుకు ఘన స్వాగతం

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న తొలి నైనీ బొగ్గు రైల్వే రేకుకు సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (ఈ&ఎం) శ్రీ ఎం. తిరుమలరావు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కోల్ యార్డులో బొగ్గు అన్‌లోడింగ్ ప్రక్రియను ప్రారంభించారు.

రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట

ఈ సందర్భంగా డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్ట‌ర్ (ఈ అండ్ ఎం) శ్రీ ఎం.తిరుమ‌ల‌రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ అవసరాలకు పెద్దపీట వేస్తూ నైనీ గని నుంచి బొగ్గు సరఫరా ప్రారంభించామని చెప్పారు. ఇప్పటి వరకు సింగరేణి ఇతర రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేసిందని, అయితే ఇప్పుడు ఇతర రాష్ట్రంలోని తన గని నుంచి స్వరాష్ట్రానికి బొగ్గు తరలించడం సంస్థ చరిత్రలో అరుదైన ఘట్టమని పేర్కొన్నారు.
singareni
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో ఇటీవల తాడిచెర్ల-2, మణుగూరు డిప్‌సైడ్ బ్లాకులు సంస్థకు లభించాయని, త్వరలో మరికొన్ని గనులను కూడా సింగరేణికి సాధించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

800 మెగావాట్ల కొత్త ప్లాంట్ త్వరలో

డైరెక్టర్ (ఈ&ఎం) శ్రీ ఎం. తిరుమలరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్ర విద్యుత్ అవసరాల తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రస్తుతం మరో 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ యూనిట్ నిర్మాణంలో ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడి శ్రీ సిహెచ్ చిరంజీవి గారు, ఎస్టిపిపి జీఎం శ్రీ ఎం. నరసింహ రావు గారు, జిఎం (ఈ & ఎం) శ్రీ సూర్యనారాయణ రాజు గారు, గుర్తింపు కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ, వీరభద్రం గారు, ప్రాతినిధ్య కార్మిక సంఘం నాయకులు, కనీస వేతనాల అమలు కమిటీ చైర్మన్ శ్రీ జనప్రసాద్, అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీ లక్ష్మీపతి గౌడ్, ఇతర అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
Share